Dec 07,2020 00:12

నిరసన తెలుపుతున్న యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌
రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ) వల్ల బలవంతంగా బదిలీ కాబడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) ఆధ్వర్యాన ఆదివారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.అప్పారావు, గొంది చినబ్బారు మాట్లాడుతూ రేషనలైజేషన్‌ వల్ల బలవంతంగా బదిలీ కాబడుతున్న ఉపాధ్యాయులకు, ప్రస్తుత పాఠశాలలలో స్టేషన్‌ సీనియారిటీ పాయింట్లతో పాటు, పాత పాఠశాలలోని స్టేషన్‌ పాయింట్స్‌ కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో ప్రభుత్వం వీరిని అందరి కంటే ముందుగా ట్రాన్స్‌ఫర్‌ చేసేదని, తరువాత కాలంలో వీరికి 10 పాయింట్స్‌ ఇచ్చి బదిలీ చేశారని, కానీ ఇప్పుడు కేవలం 5 పాయింట్లు మాత్రమే ఇవ్వడం వలన వారు చాలా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు వి.శ్రీలక్ష్మి, నిర్మల కుమారి, రేషనలైజేషన్‌ ప్రభావిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.