Oct 18,2023 22:06

ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదంగా మారాలి
ప్రారంభమైన యుటిఎఫ్‌ నిరవధిక దీక్షలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:పాత పెన్షన్‌ విధానం (ఒపిఎస్‌) పునరుద్ధరిస్తామన్న పార్టీకే ఓటు వేయాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ఉద్యోగ, ఉపాధ్యాయులను కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దీనినే నినాదంగా తీసుకోవాలని సూచించారు. ఒపిఎస్‌ అమలుపై రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరి ప్రకటించాలని కోరారు. ఒపిఎస్‌ సాధనకై యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్షా శిబిరాన్ని లక్ష్మణరావు ప్రారంభించి మాట్లాడారు. పెన్షన్‌ అనేది ఉద్యోగి హక్కు అని, భిక్ష కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్‌ విధానంలో ఉన్నారని చెప్పారు. సిపిఎస్‌ రద్దు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టక్కర్‌ కమిషన్‌ను తీసుకొచ్చి అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు రద్దు చేస్తానన్న ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మాట మార్చారని విమర్శించారు. సిపిఎస్‌ రద్దు చేయకుండా జిపిఎస్‌ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఇందులో కాంట్రిబ్యూషన్‌ ఉందని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం జరగదని చెప్పారు. పెన్షన్‌ కొనసాగితే రాష్ట్ర ఖజానా దివాళా తీస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యం లేని వాదనలు చెబుతోందన్నారు. వీటిని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్‌ నుంచి ఒపిఎస్‌లోకి వచ్చాయని తెలిపారు. ఒపిఎస్‌ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దస్థాయిలో ఒత్తిడి తేవాలని కోరారు.
యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సిపిఎస్‌కు ప్రత్యామ్నాయం జిపిఎస్‌ కాదన్నారు. ఉద్యోగులకు ఒపిఎస్‌ లాభమని తాము రాష్ట్ర ప్రభుత్వానికి గణాంకాలతో వివరించామని, అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఒపిఎస్‌ అమలు చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఒపిఎస్‌ అమలు చేస్తామన్న పార్టీకే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓట్లు వేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ విధానంలో కాకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు. భవిష్యత్తులో రెగ్యులర్‌ ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చినా పెన్షన్‌ ఉండదన్నారు. పాత పెన్షన్‌ కోసం తాము చేసే ఉద్యమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని, పెన్షన్‌ అమలు చేసే పార్టీకే ఓటు వేయాలని కోరారు. గురువారం జిల్లా కేంద్రాల్లో, శుక్రవారం పాత తాలూకా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. పాత పెన్షన్‌ సాధించే వరకు కొనసాగుతాయని చెప్పారు. ఎపిసిపిఎస్‌ఇఎ అధ్యక్షులు అప్పలరాజు దీక్షలకు సంఘీభావంగా మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్దానాలకు తాము బలయ్యామని, రాష్ట్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిపిఎస్‌ పేరుతో మోసపూరిత విధానాన్ని తీసుకొచ్చి తమపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిపిఎస్‌లో ఏయే అంశాలు ఉన్నాయో ఒక్కసారి కూడా సంఘాలతో చర్చించలేదని, దొంగచాటుగా బిల్లు తెచ్చిందని ఆగ్రహించారు. జిపిఎస్‌ పేరుతో ఉన్న సమస్యను ప్రభుత్వం మరింత జఠిలం చేసిందన్నారు. దీక్షలో యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, సహాధ్యక్షులు కె సురేష్‌కుమార్‌, కోశాధికారి బి గోపీమూర్తి, కార్యదర్శులు ఎన్‌ మనోహర్‌కుమార్‌, వి కోటేశ్వరప్ప, ఐక్య ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు ఎన్‌ కుమార్‌ రాజా, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ టిఎస్‌ఎల్‌ఎన్‌ మల్లేశ్వరరావు, ప్రచురణల కమిటీ ఛైర్మన్‌ ఎం హనుమంతరావు ఉన్నారు. దీక్ష ప్రారంభానికి ముందు చెన్నుపాటి లక్ష్మయ్య, అప్పారి వెంకటస్వామి, దాచూరి రామిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె ప్రసన్నకుమార్‌, ఎ అశోక్‌ దీక్షలకు మద్దతు ప్రకటించారు.

  • దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

యుటిఎఫ్‌ నిరవధిక నిరాహార దీక్షలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పూర్తి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావుతో కలిసి సందర్శించారు. 2004లో పెన్షన్‌ విధానం రద్దు చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో నాలుగైదు ఏళ్ల నుంచి ఉద్యమం సమరశీలంగా నడుస్తుందని, ఈ పోరాటానికి సిపిఎం మద్దతు ఎప్పుడూ ఉంటుందని శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పోరాటాన్ని అణచివేయాలని చూస్తుందన్నారు. ఈ దీక్షలు ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలని అన్నారు. సిపిఎస్‌ను రద్దు చేస్తానని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని, తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హామీలు నెరవేర్చినట్లు నెరవేరుస్తారని ప్రభుత్వ ఉద్యోగులు నమ్మారని అన్నారు. ఇప్పుడు తెలియక వాగ్దానం చేశానని మోసపూరిత ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఉద్యోగుల పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్‌ రద్దుకు చేస్తున్న పోరాటం న్యాయమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని, ఈ ఆందోళనలకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలన్నారు. సిపిఎస్‌ రద్దుపై అన్ని రాజకీయ పార్టీలూ తమ వైఖరి ప్రకటించాలని కోరారు.