ప్రజాశక్తి - యంత్రాంగం : క్షణికావేశానికి లోనై నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనే కారణంతో ప్రాణాలను బలితీసుకుంటున్నారు. బుధవారం సాయంత్రం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని ముగ్గురు విద్యార్థులు బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన జి.బాలు (19) గంగవరం మండలం మదర్‌థెరిస్సా కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిన విషయం కుటుంబసభ్యులు, స్నేహితులకు తెలిస్తే ఎగతాళి చేస్తారని..బుధవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగారు. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం దండుగోపాలపురానికి చెందిన బాలక కృష్ణరావు, గౌరమ్మల రెండో కుమారుడు బాలక తరుణ్(16). తల్లిదండ్రులు చెన్నైలో కూలి పనులకు వెళ్లడంతో తాతయ్య, నాయనమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరుణ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురై టెక్కలి జిల్లా ఆస్పత్రి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
విశాఖ జిల్లా మల్కాపురం పోలీసుస్టేషన్ పరిధి త్రినాధపురం హనుమాన్ దేవాలయం సమీపంలో నివసిస్తున్న ఆత్మకూరు వెంకటేశ్వరరాజు కుమార్తె అఖిలశ్రీ (16) గాజువాకలోని గాయత్రి కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.










