May 11,2023 11:48

ప్రజాశక్తి-జరుగుమల్లి : మరో పదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని కామేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఫెయిల్ అయిన బూడంగుంట్ల సుజిత్ కుమార్ బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని మరణించారు. వివరాలలోకి వెళితే రోజు లాగే సుజిత్ కుమార్ తల్లి దండ్రులు యోహాను అక్కమ్మ ఉపాధిహామీ పథకంలో మట్టి పనికి వెళ్ళారు. వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి సుజిత్ కుమార్ ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు. బంధువుల సహాయంతో కొండపి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి చూసి మృతి చెందినట్లు తెలపడంతో ఇంటికి తీసుకొచ్చారు. సుజిత్ కుమార్ క్రమం తప్పకుండా ప్రతి రోజు పాఠశాలకు వెళ్లేవాడని, తరగతి గదిలో నిశబ్దంగా వుంటాడని తోటి విద్యార్ధులు తెలిపారు. ఈ నెల 6వ తేదీన వచ్చిన 10వ తరగతి ఫలితాలలో ఫెయిల్ అవడంతో మనస్తాపంతో గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లిన తరువాత ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం.