Jun 05,2023 09:55

ఖమ్మం : ఖమ్మంలో దంత వైద్య విద్యార్థిని మృతి కలకలం రేపింది.

ఖానాపురం హవేలి సిఐ శ్రీహరి వివరాల మేరకు .... వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌ ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మంలోని ఓ కళాశాలలో బీడీఎస్‌ చివరి సంవత్సరం చదువుతోంది. కళాశాల ఎదురుగా ఉన్న ప్రైవేటు వసతిగృహం నాలుగో అంతస్తులోని ఓ గదిలో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఉన్న గదిలో నుండి కాలిపోయిన వాసన వస్తుండటంతో నిర్వాహకులు, ఇతర విద్యార్థినులు వచ్చి చూశారు. ఆమె గది నుంచి పొగలు వస్తుండటంతో ఆందోళన చెంది వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మంటల్లో కాలిపోతున్న మానసపై నీళ్లు పోసి కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

                                                                     తండ్రి మృతితో మనస్తాపం...

ఈ ఘటనకు ముందు మానస గది నుంచి కేకలు వినిపించాయని కొందరు చెబుతున్నారు. హాస్టల్‌ సమీపంలోని ఓ పెట్రోలు బంకు నుంచి మానస పెట్రోలు కొని తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డవడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఇటీవలే తండ్రి మృతి చెందడంతో మనస్తాపం చెందిన మానస.. తరచూ ఆయనను తలచుకుని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా ఆమె తోటి విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి మాట్లాడి వచ్చినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, మఅతురాలి బంధువులు వరంగల్‌ నుంచి రావాల్సి ఉందని సిఐ తెలిపారు. విద్యార్థిని గదిలో ఎలాంటి లేఖ కనిపించలేదని, ఆమెది ఆత్మహత్య అయ్యి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.