Oct 31,2023 12:00

హైదరాబాద్‌ : మరెవరు ఈ కాలేజీ లో జాయిన్‌ కావద్దనీ, విద్యార్థుల మీద ప్రెజర్‌ పెట్టద్దనీ.. ఇదే నా చివరి రోజనీ సూసైడ్‌ లెటర్‌ రాసి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో జరిగింది.

హైదరాబాద్‌ చైతన్యపురిలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న వైభవ్‌ అనే విద్యార్థి సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కువ మార్కులు రాలేదని కాలేజీ యాజమాన్యం వేధించడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఈ కాలేజీలో ఎవరూ చేరవద్దని వైభవ్‌ లేఖలో పేర్కొన్నాడు. గతంలో కూడా ఇంటర్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు రాకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు జరిగాయి. వైభవ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు తెలపడంతో హుటాహుటిన తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఎక్కువ మార్కులు రావాలంటూ కాలేజీ ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఒత్తిడి కారణంగా తమ కుమారుడు సూసైడ్‌ చేసుకున్నాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాలేజ్‌ యాజమాన్యం తమ బాబుని పొట్టనపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా వేధింపులకు గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ మార్కులు వచ్చాయి.. మీ బాబును పంపిస్తున్నాం అని కాలేజీ మేనేజ్‌మెంట్‌ చెప్పిందని తల్లిదండ్రులు వాపోయారు. వేలకు వేల రూపాయలు పెట్టిమరీ చదివించామని, కానీ తమ బాబును మేనేజ్‌ మెంట్‌ వేధింపులకు గురిచేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. '' మరెవరు ఈ కాలేజీ లో జాయిన్‌ కావద్దనీ, విద్యార్థుల మీద ప్రెజర్‌ పెట్టద్దనీ.. ఇదే నా చివరి రోజనీ సూసైడ్‌ లెటర్‌ రాసాడని '' చెప్పారు. ఈరోజు మా బాబును కోల్పోయాం అంటూ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. చైతన్యపురి నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అప్పటివరకు మఅతదేహాన్ని ఇక్కడి నుండి కదలనివ్వబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.