ప్రజాశక్తి-శ్రీసత్యసాయి జిల్లా(హిందూపురం) : పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్పెక్టర్ తీరును నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు గురువారం ఉదయం విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులపై సానిటరీ ఇన్స్పెక్టర్ తాగిన మైకంలో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నాడని ఇతనికి అనుకూలంగా ఉన్న కార్మికులకు పని ఒత్తిడి తగ్గించి, ఇతరులపై పని ఒత్తిడి పెంచుతున్నారు అన్నారు. వెంటనే ఇతన్ని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డిలకు వినతిని అందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సేనిటరీ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జగదీష్, నాయకులు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.










