ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో పనిచేస్తున్న కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వి శ్రీనివాసరావు శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో దాదాపు 40 వేలమంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఎక్కడా అమలుకావడం లేదని తెలిపారు. గతంలో అనేక తీర్పుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు టైమ్‌స్కేల్ అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా అమలు కావడం లేదనితెలిపారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులను నియమించకూడదని చట్టం చెబుతునుప్పటికీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లు, నగర పంచాయతీలలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేయడం సరైందికాదని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు నాలుగేళ్లయినా అమలుకాని పరిస్థితి వుందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామని, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే వారంలోపు సిపిఎస్‌ను రద్దు చేస్తామని ఉద్యోగులకు ఇచ్చిన హామీ కూడా అమలుకునోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి శాశ్వత స్వభావంలో పనిచేసే కార్మికులందరినీ పర్మినెంటు చేయాలని కోరారు. ప్రస్తుతం మున్సిపాలిటీలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 010 పద్దు కింద మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం, ఇంజినీరింగు కార్మికులకు హెల్త్, రిస్క్ అలవెన్సులు చెల్లించడంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు జిఓఎంఎస్ నెంబరు 7 మేరకు నెలకు రూ.18,500 చెల్లించాలన్నారు. ఉద్యోగులకు సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు యాత్రలు చేస్తునాురని, సంబంధిత ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు.










