హైదరాబాద్ (అల్వాల్): వరద నీటితో ఇంటిలోకి చేరిన పామును పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. ఆ పామును నేరుగా జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడి అధికారి టేబుల్‌పై వేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. అల్వాల్ భారతీనగర్‌లోని నివసించే అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న మురుగు కాల్వ ద్వారా మంగళవారం ఓ పాము లోపలికి ప్రవేశించింది. వెంటనే అతడు మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పామును పట్టుకుని దగ్గరలోని వార్డు కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడాన్ని గమనించాడు. అనంతరం కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారి టేబుల్‌పై పామును ఉంచి నిరసన వ్యక్తం చేశాడు. చివరకు సిబ్బంది స్పందించి అక్షయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న పొదల కారణంగా పాములు వస్తున్నాయంటూ వాటిని తొలగించారు.










