Aug 30,2023 16:24

న్యూఢిల్లీ :   ఢిల్లీ యూనివర్శిటీ (డియు)లో ప్రసంగాన్ని రద్దు చేయడంపై ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ కుమార్‌ ఝా ధ్వజమెత్తారు. యూనివర్శిటీల విలువలను దిగజారుస్తుంటే... భారత్‌ విశ్వగురుగా ఎలా మారుతుందని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. యూనివర్శిటీపై ఆంక్షలు విధిస్తూ... వాటి అభివృద్ధికి అడ్డంకిగా మారితే... అవి విజ్ఞాన కేంద్రాలు కాలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్‌ ప్రపంచానికి భారత్‌ విశ్వగురు (టీచర్‌) అని నినదించే బిజెపిని ఎద్దేవా చేశారు.

విషయమేమిటంటే..
తమ కాలేజీ, యూనివర్శిటీ అధ్యాపకుల బృందానికి సోషల్‌ వర్క్‌ మరియు సోషల్‌ సైన్సెస్‌పై వర్చువల్‌గా ఉపన్యాసమివ్వాలంటూ డియుకి చెందిన సెంటర్‌ ఫర్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆగస్ట్‌ 18న మనోజ్‌ కుమార్‌ ఝాని ఆహ్వానించింది. ఆయన డియు సోషల్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌ కూడా. దీంతో సంబంధిత విభాగంలో రిఫ్రెషర్‌ కోర్సు కోసం రిసోర్స్‌ పర్సన్‌గా ఉండాలని సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గీతా సింగ్‌ ఆహ్వాన పత్రంలో అభ్యర్థించారు. అయితే లెక్చర్‌ కార్యక్రమం రద్దైందని సెంటర్‌ డైరెక్టర్‌ నుండి ఓ మెయిల్‌ వచ్చిందని ఝా తెలిపారు. అనివార్య పరిస్థితుల్లో మీ కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసునని, ఈ చర్య స్థిరమైన అభ్యాసాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు.

''ఇది నా యూనివర్శిటీ, నేను ఇక్కడ బోధిస్తాను. నేను ఇక్కడే చదువుకున్నాను. నేను పార్లమెంటులో మాట్లాడతాను, వీధుల్లో మాట్లాడతాను, అలాగే వార్తాపత్రికలకు వార్తలు పంపుతాను. కానీ ఇప్పుడు యూనివర్శిటీలో ప్రసంగించకుండా నన్ను అడ్డుకున్నారు. వారికి ఎందుకంత భయం'' అని ప్రశ్నించారు.