Feb 17,2023 10:53
  • స్వచ్ఛంద సంస్థ వసతి గృహంలో హైడ్రామా
  • ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యంకు విందు

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : పశ్చియ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో విద్యాశాఖ ఉన్నతాధికారి ఆర్‌జెడి ప్రతాప్‌రెడ్డి ప్రయివేటు విద్యా సంస్థల యజమాన్యాలకు విందు, మందు ఏర్పాటు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. అధికారపార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కల్పలతారెడ్డి భర్త అయిన ప్రతాప్‌రెడ్డి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాతనే రాయలసీమ ఆర్‌జెడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం జరిగినప్పుడే అనేక విమర్శలు వచ్చాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి అధికారపార్టీకి అనుకూలంగా ఓట్లు వేయాలని ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గురువారం రాత్రి ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన అతిథి గృహంలో నగరంలోని కొన్ని విద్యా సంస్థ యజమానులకు విందుతోపాటు, మందు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలని ఈ విందులో కోరినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ జరుగుతున్న తంతును తెలియజేసేందుకు వెళ్లిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పరమేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు కుళ్లాయప్ప, పిడిఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిపై ప్రతాప్‌రెడ్డి తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఏకంగా తనపై హత్యయత్నం చేయడానికి వచ్చారంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ విందు చేసుకుంటున్న ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా వ్యవహరిస్తున్న వారిని వదిలేసి, ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్లిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పరమేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు కుళ్లాయప్ప, తదితరులను అరెస్టు చేసి రాప్తాడు పోలీసు స్టేషన్‌కు రాత్రి సమయంలో తీసుకెళ్లారు. ఆర్‌జెడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
 

                           ప్రభుత్వ అధికారా..? వైసిపి ఎన్నికల ఏజెంటా.? : సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌

అనంతపురంలో వైసిపి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆర్‌జెడి ప్రతాపరెడ్డి తీరును సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌, ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిల ద్వారా ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని ఒక ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో గురువారం రాత్రి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను పిలిపించుకుని ప్రతాపరెడ్డి మాట్లాడడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అన్నారు. దీన్ని ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై దౌర్జన్యానికి దిగడం పట్ల ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ప్రతాపరెడ్డిని విధులు నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు.