న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లుపై ఆర్జేడి నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్‌స్టిక్‌లు బాబ్ కట్ చేసుకున్న మహిళలంతా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకొస్తారని వ్యాఖ్యానించారు. సిద్దిఖీ వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని నేతలు కూడా విబేధించారు.
కాగా, బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దిఖీ మాట్లాడుతూ.. 'మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఇకపై ఈ బిల్లు పేరు చెప్పి లిప్‌స్టిక్‌లు పెట్టుకునే ఆడవాళ్లు బాబ్ కట్ చేసుకునే ఆడవాళ్లుహంగామా చేయడం మొదలు పెడతారు చూడండి' అని వ్యాఖ్యానించారు. ఆపై తాను చేసిన వ్యాఖ్యలను సిద్దిఖీ సమర్ధించుకున్నారు. కేవలం గ్రామస్తులకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసమే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తమ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇస్తుందని.. ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కూడా ఈ బిల్లుకు ఆర్జేడి మద్దతిచ్చిందని బిల్లులో ఓబీసీలను చేర్చకపోవడంపై మాత్రం తమ పార్టీ తీవ్రస్థాయిలో విభేదించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌశల్ కిషోర్ తీవ్రంగా స్పందించారు. 'సిద్ధిఖీ వ్యాఖ్యలనుబట్టి ఆయన ఆలోచనలు ఎంత కింది స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతున్నాయి. మహిళలు చట్టాలను, రాజ్యాంగాన్ని బాగా అధ్యయనం చేసి ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించేందుకు వస్తున్నారు. ఒక కారుకు చక్రాలు ఉన్నట్టుగానే పార్లమెంటులో కూడా పురుషులు మహిళలు చట్టాలు చేయడంలో భాగస్వాములవుతారని.. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎలా వ్యాఖ్యలు చేస్తారని కౌశల్ కిశోర్ సిద్ధిఖీని ప్రశ్నించారు. ఇక సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వారు కూడా ఖండించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజి మాట్లాడుతూ.. మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఓబీసీల తోపాటు ఎస్సీ,ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల వారు కూడా రిజర్వేషన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు.










