ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎంఎల్‌సి ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, అవకతవకలకు సంబంధించి కడప ఆర్‌జెడి ప్రతాప్ రెడ్డిపై విచారణ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్‌మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదినే ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినప్పటికీ గురువారం వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. టిడిపి ఎమ్మెల్సీ పి అశోక్ బాబు, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్, ఎస్టియు ప్రధాన కార్యదర్శి తిమ్మన్న తదితరులు ఈ ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపించి నివేదిక అందించాలని కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లకు మీనా ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ రాయమలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అభ్యర్ధిగా వైసిపి తరపున పోటీ చేస్తున్న ఎంవి రామచంద్రారెడ్డికి ప్రతాప్ రెడ్డి సహకరిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. రామచంద్రారెడ్డికి ఓట్లు వేయాలని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారన్నది ఈ ఫిర్యాదుల సారాంశం, కర్నూలు ఎస్వి కాంప్లెక్స్, ఆదోనిలో జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి ప్రచారం కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్టుగా ఉన్న ప్రతాప్ రెడ్డిని రాష్ట్రప్రభుత్వం ఇటీవల కడప ఆర్‌జెడిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.










