- సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం చేపట్టనున్న 'ఖాదీ మహోత్సవ్' కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుందని సమగ్ర శిక్ష డైరెక్టరు బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఖాదీ మహోత్సవ్ అంశంగా అన్ని పాఠశాలల్లో క్విజ్, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. క్విజ్ పోటీల్లో ఈ నెల 31 వరకు ఎవరైనా పాల్గొనవచ్చునని వివరించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలను పాఠశాల స్థాయిలో శుక్రవారం, మండల స్థాయిలో శనివారం, జిల్లా స్థాయిలో ఆదివారం నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలను, భాష, కేటగిరి వారీ వివరాలను సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి ఈ నెల 29లోపు పంపాలని ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులకు, సమగ్ర శిక్ష ఎపిసిలకు ఆదేశాలు జారీ చేశారు.










