- ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం విమర్శ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : చేనేతలకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం విమర్శించింది.ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ విడుదల చేసిన ప్రకటనలో గుజరాత్ కార్పొరేట్లకు అనుకూలంగా జరీపై జిఎస్‌టి 12 శాతం నుండి ఐదుశాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది చేనేత వృత్తిలో బతుకుతున్నారని, వారంతా చేనేతపై జిఎస్‌టిని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అయినా మోడీ ప్రభుత్వం పవర్‌లూమ్‌లకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల మగ్గాలు మూలనపడ్డాయని తెలిపారు. చేనేత కార్మికులు పనులు లేక ఆకలిచావులకు గురవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూలుపై ఐదుశాతం, జరీపై 12 శాతం, రంగులపై 18 శాతం, రసాయనాలపై 18 శాతం జిఎస్‌టి విధించి వారి నడ్డి విరించిందని మండిపడ్డారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభత్వుం జిఎస్‌టిని తగ్గించి చేనేతలను కాపాడాలని ఆయన కోరారు. లేనిపక్షంలో కేంద్రానికి చేనేతలు తగు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.










