ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నేతన్న నేస్తం కింద 2023-24 సంవత్సరానికి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నూతన లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఈనెల 20లోగా పూర్తి చేయాలని హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ కమిషనర్ శనివారం విధివిధానాలు జారీచేశారు. గ్రామ, వార్డు సెక్రటరియేట్ల ద్వారా కొత్త లబ్దిదారులు, పాత లబ్ధిదారులు (ఇప్పటికే సహాయం పొందిన వారు) ధృవీకరణ ప్రక్రియ ఈనెల 21లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే రోజు ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి జిల్లాల వారీగా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, జనరేషన్ ఆఫ్ సోషల్ ఆడిట్ ప్రొవిజనల్‌కు పంపాల్సి ఉంటుంది. 28న సెక్రటరీ స్థాయిలో జాబితా ప్రచురించనున్నారు. 30న దరకాస్తుల ఎంపికపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదులను స్వీకరిస్తారు. అర్హుల తుది జాబితాను జులై ఆరోతేదీన తయారు చేయనున్నారు. జిల్లా కలెక్టర్/డిఎల్‌సి ద్వారా జులై 8వ తేదీన తుది జాబితాను ఆమోదించనున్నారు. అనంతరం సిఎం ఆదేశాల మేరకు నిధులు విడుదల అవుతాయని అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.










