Oct 19,2023 08:27

ప్రజాశక్తి-మధురవాడ : కేంద్రప్రభుత్వ మహరత్న కంపెనీలలో ఒకటైన గెయిల్‌, వివిధ ప్రాంతాలలో ఉపయోగిస్తున్న గ్యాస్‌ పైప్‌లైన్‌లకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం, బుధవారం వాటిని అధికారికంగా గెయిల్‌ సంస్థకు బదలాయించింది. గెయిల్‌ విశాఖ-సికిందరాబాద్‌ ఎల్‌పిజి పైప్‌లైన్‌ ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌.ఎస్‌.రావు పాల్గొని సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అధికారిక పత్రాలను గీతం రీసెర్చి డైరక్టర్‌ ప్రొఫెసర్‌ రాజా ఫణి పప్పు నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా ఎల్‌.ఎస్‌.రావు మాట్లాడుతూ తమకు ఎదురైన సాంకేతిక సమస్యకు గీతం టెక్నాలజీ ఆఫీసర్‌ డాక్టర్‌ చంద్రమౌళి అతితక్కువ సమయంలో పరిష్కారం చూపారని అభినందించారు. భవిష్యత్తులో మరికొన్ని ప్రాజెక్టులను గీతం వర్సిటీకి ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎల్‌పిజి. పైప్‌లైన్‌ పరిజ్ఞానంపై విద్యార్ధులకు అవగాహన కలిగించడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. గీతం రీసెర్చి డైరక్టర్‌ ప్రొఫెసర్‌ రాజా ఫణి పప్పు మాట్లాడుతూ గీతం టెక్నాలజీ అనేబిలింగ్‌ సెంటర్‌ (జి-టెక్‌) ద్వారా రాష్ట్రంలోని విద్యాలయాలకు పరిశ్రమలకు మధ్య సంబంధాలను మెరుగు పరిచేందుకు కృషిచేస్తున్నామన్నారు. స్థానిక పరిశ్రమలు తమ సాంకేతిక సమస్యలను జిటెక్‌ దృష్టికి తెచ్చి, పరిష్కారం పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో గీతం టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చంద్రమౌళి, గెయిల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పి.రామకృష్ణ, మెకానికల్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, జి-టెక్‌ డిప్యూటీ డైరక్టర్‌ సోంభట్‌ శాస్త్రి, ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ కె.విశ్వనాధ్‌ చైతన్య పాల్గొన్నారు.