ప్రజాశక్తి - మధురవాడ (విశాఖపట్నం) :గీతం యూనివర్సిటీ స్థలం విషయంలో అధికారుల తీరుతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గీతం ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్‌డిఒ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యాన శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి కంచె వేసే పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎండాడ నుంచి గీతం వర్సిటీ వైపు వెళ్లే రహదారిలో, రుషికొండ కూడలి వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. ఏదైనా గుర్తింపు ఉంటేనే ఆయా మార్గాల్లో అనుమతించారు. పోలీసులు భారీగా మోహరించడంతో అలజడి నెలకొంది. విషయం తెలుసుకున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు తదితరులు అక్కడకు చేరుకున్నారు. గీతం వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. వర్సిటీలో ప్రభుత్వ స్థలం ఉంటే స్వాధీనం చేసుకోవాలి తప్ప ఇబ్బంది కలిగించేలా వ్యవహరించరాదన్నారు. ఈ ఏడాది జనవరిలోనూ గీతం వర్సిటీ వద్ద కంచె వేసే సమయంలో ఉద్రికత్త నెలకొన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ భూమిలో కంచె వేశాం : ఆర్‌డిఒ
గీతం ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కంచె వేసినట్టు భీమిలి ఆర్‌డిఒ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఇంకా గీతం పరిధిలో 14 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ స్థలాన్నీ స్వాధీనం చేసుకుంటామన్నారు.










