- తేజ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సృష్టికర్త హరినారాయణకు గౌరవ డాక్టరేట్
ప్రజాశక్తి - మధురవాడ (విశాఖపట్నం):గీతం విశాఖపట్నం డీమ్డ్ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవం శనివారం వర్సిటీలో ఘనంగా జరిగింది. వర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ వీరేంద్ర సింగ్ చౌహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తేజ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సృష్టికర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కోటా హరినారాయణకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ సైన్స్)ను, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి వాణిశ్రీకి గౌరవ డాక్టరేట్ డిలిట్‌ను అందజేశారు. స్నాతకోత్సవానికి భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం (డిఎస్‌టి) కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత దేశం గణనీయ ప్రగతి సాధిస్తోందని తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావం, సంప్రదాయేతర ఇంధన వనరుల అవసరాలు, డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న పోటీపై దేశ యువత బాధ్యతగా మెలగాలని సూచించారు. సరికొత్త ఆలోచనలతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో వ్యవసాయ రంగం కుంటుపడి ఆహార భద్రతకు ముప్పు రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా 2022-23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంబిఎ, బిబిఎమ్, బికామ్ వంటి కోర్సులు పూర్తి చేసిన 2769 మంది పట్టభద్రులకు డిగ్రీలు, 84 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లు, అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకు 72 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ అధ్యక్షులు ఎం.శ్రీభరత్, ఉపాధ్యక్షులు ఎమ్.గంగాధరరావు, కార్యదర్శి ఎమ్.భరద్వాజ, రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్ పాల్గన్నారు. స్నాతకోత్సవ వేదికపై నటి వాణిశ్రీ చేసిన చేసిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్ద చదువులు చదవలేకపోయినట్టు ఆమె తెలిపారు.










