- గీతం స్నాతకోత్సవంలో ఐసిసిఆర్ అధ్యక్షుడు సహస్రబుదే
ప్రజాశక్తి - విశాఖపట్నం :యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలతో పాటు నైపుణ్యంగల మానవ వనరులను తయారు చేసే దిశగా ఉన్నత విద్యాలయాలు తమ భవిష్యత్ ప్రణాళికలలో మార్పులు చేయాలని భారత ప్రభుత్వ సాంస్కృతిక సంబంధాల విభాగం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) అధ్యక్షుడు డాక్టర్ వినరు ప్రభాకర్ సహస్రాబుదే అన్నారు. విశాఖలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవాన్ని శనివారం సంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ వ్యవస్థలను, సంస్థలను సమర్థంగా నడిపే నాయకులను తయారు చేయలేకపోవడం ప్రధాన లోపమని అభిప్రాయపడ్డారు. లీడర్‌షిప్ సైన్స్, ఇనిస్టిట్యూషన్ బిల్డింగ్ సైన్స్, యూనివర్సిటీ మేనేజ్‌మెంట్, అర్బన్ ప్లానింగ్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ వంటి అంశాలపై ప్రత్యేక కోర్సులు అవసరమని తెలిపారు. గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గడిచిన నాలుగు సంవత్సరాలు విద్యారంగం పెను సవాళ్ళను ఎదుర్కొందని, వాటిని దృష్టిలో ఉంచుకొని బోధనా విధానాలలో పలు సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. స్నాతకోత్సవంలో భాగంగా సంగీత, సాహిత్య రంగాలలో విశేష కృషి చేస్తోన్న సుప్రసిద్ధ గాయకుడు కొమరవోలు శివప్రసాద్‌కు, డాక్టర్ ఎల్‌ఆర్.స్వామికి గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశారు. విశాఖ ప్రాంగణం నుంచి 2021-22 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, లా, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంబిఎ, బిబిఎమ్, బికామ్ వంటి కోర్సులు పూర్తి చేసిన 3239 మంది పట్టభద్రులకు స్నాతకోత్తర డిగ్రీలను, 72 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లను అందజేశారు.










