- కరోనా తర్వాత నుంచి చిత్ర పరిశ్రమలో సాంకేతిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. లాక్‌డౌన్ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదని ఓటీటీ వేదికలు పుట్టుకొచ్చాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలకు డబ్బులు కట్టి ఫోన్లలోనే సినిమాలను చూడటం అలవాటు పడ్డారు. దాంతో ఇప్పుడు థియేటర్లకు వచ్చి సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. గతంలో లాగా భారీ సంఖ్యలో అభిమానులు వచ్చి హంగామా చేసే పరిస్థితి లేదు. ఓటీటీ సినిమాలను తమకు వీలైన సమయంలో ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. దీంతో పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన వారానికే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఎపీఎస్‌ఎఫ్‌ఎల్) కొత్త విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీనివల్ల సినిమా విడుదలైన రోజునే మొదటి ఆటను ఇంట్లోనే చూడొచ్చు. ఈ విధానం వల్ల చిన్న-పెద్ద సినిమా అని తేడా లేకుండా విడుదలైన రోజే ప్రేక్షకులు ఇంట్లోనే ఉండి సినిమా చూడొచ్చు అంటున్నారు. ఒకప్పుడు కొత్త సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూడాలంటే అంత ఈజీ కాదు. అదిప్పుడు అత్యంత సులభం అయ్యే రోజొచ్చింది.
ఒకప్పుడు పెద్ద సినిమా థియేటర్లలో విడుదలైతే- ఎన్ని రోజులైనా చిన్న సినిమాలకు థియేటర్లు దొరికేవి కావు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. ఓటీటీలు వచ్చాక చిన్న సినిమాలు తీసే దర్శకులు, నటీనటులకు మంచి అవకాశం వచ్చినట్టే అయ్యింది. కరోనా సద్దుమణిగాక ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది. చిన్న సినిమాలకు ఓటీటీలు, పెద్ద సినిమాలకు థియేటర్లు అన్న వాతావరణం నడిచింది. ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా పోతున్నాయి. ఏపి స్టేట్ సాంకేతిక విభాగం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. అధికారులు ఫైబర్ నెట్ ద్వారా దేశంలోనే ప్రయోగాత్మకంగా ఒక వినూత్న విధానాన్ని అమలు చేయబోతున్నారు. దీంతో ఇంట్లోనే ఉండి కొత్త సినిమాను చూడొచ్చు. యాప్, ఆపరేటర్ ద్వారా నగదు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వారు 24 గంటల్లోగా సినిమాను చూడొచ్చు. కొత్త దర్శకులకు, చిన్న నిర్మాతలకు అవకాశం కల్పించినట్లు ఉంటుంది.
ప్రస్తుతం చిన్న సినిమాలే కొత్త కొత్త ప్రయోగాలకు, ప్రయత్నాలకు వేదికలుగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందతున్నాయి. ఇందుకు 'బలగం' సినిమానే నిదర్శనంగా చొప్పొచ్చు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాజా, కమలిని ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆనంద్' చిత్రం విడుదలైన వారం తర్వాత ప్రజల్లోకి వెళ్లింది. వారం కూడా ఆడదనుకున్న ఈ చిత్రం దాదాపు 130 రోజలు ఆడి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. 'బిచ్చగాడు' విడుదలైన వారం వరకు అసలు ఈ సినిమా ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. అమ్మ కోసం ఒక కోటీశ్వరుడు బిచ్చగాడిగా మారిన కథను చూసిన ప్రేక్షకులు మెచ్చడంతో- అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కొనేందుకు ముందుకు వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేక్షాదరణ పొందిన చిన్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కథలో వాస్తవికత, సామాజిక అంశాలు, కొత్తదనం ఉంటే చిన్న అయినా, పెద్ద అయినా సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది.
ఇంట్లోకే నేరుగా సినిమా వచ్చే సాంకేతిక పరిజ్ఞానం వల్ల భవిష్యత్తులో పైరసీ సమస్య కూడా ఉండదు. కొంతమంది కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వాటిని థియేటర్లో షూట్ చేసి,కొన్ని యాప్స్‌లో ఉంచుతున్నారు. దాంతో చాలామంది డబ్బు చెల్లించకుండా సినిమాలు చూస్తున్నారు. ఇది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కలిగిస్తుంది. వీటన్నిటికీ నూతన విధానం చెక్ పెట్టుబోతుందని నిపుణులు అంటున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమాలు కొన్నేళ్ల పాటు థియేటర్లలో కూడా వస్తాయి. అవి ఫైబర్ నెట్‌లోనూ విడుదల చేసుకోవచ్చు. ఇదే గనుక పూర్తిగా అమల్లోకి వస్తే చందాదారులకు ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తప్పదని విక్రమ్ సినిమా నిర్మించిన సమయంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముందుగానే చెప్పారు. అయితే, అప్పట్లో చాలామంది ఆ ఆలోచనను తప్పుబట్టారు. కానీ, ఆచరణలో కమల్ మాటే ఇప్పుడు నిజమవుతోంది.










