Oct 07,2023 21:02

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు బయటకు వచ్చిందని, నాటి ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈ కేసులో ఉండే అవకాశాలు లేకపోలేదని ఎపి ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఎపి ఫైబర్‌గ్రిడ్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో మాజీ మంత్రి నారా లోకేష్‌ పాత్ర ఉందా లేదా అనేది తను చెప్పలేనన్నారు. టెరాసాఫ్ట్‌ పాత్ర లేకపోతే ఇక్కడ అసలు కుంభకోణమే లేదన్నారు. ఈ కేసుకు ఎపి ఫైబర్‌నెట్‌ రూ.7 కోట్ల షేర్‌ క్యాపిటల్‌ ఉందని, కంపెనీ ఆస్తుల విలువ రూ.3,586.22 కోట్లకు చేరిందన్నారు. రూ.627 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌ కోసం ఆర్‌ఇసి హడ్కో నుంచి రూ.450 కోట్లు లోన్‌ తీసుకుందని, రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.300 కోట్లు లోన్‌ తీసుకుంటామన్నారు. రూ.1,145.10 కోట్లతో సిసి కెమెరాల ప్రాజెక్టు చేపట్టి హోమ్‌ డిపార్టుమెంట్‌కు లీజుకు ఇవ్వనున్నట్లు గౌతమ్‌రెడ్డి తెలిపారు. షేర్‌ క్యాపిటల్‌ వ్యాల్యూ రూ.రెండు వేలకోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 1.50 కోట్ల కనెక్షన్లు ఇచ్చే కెపాసిటీ తమకు ఉందన్నారు.