Jan 24,2021 20:48

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా విజయకేతనం ఎగరవేయడానికి టీమిండియా మాజీ క్రికెటర్‌, ఎన్‌సిఎ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కారణమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా బలమైన ఆసీస్‌ను సొంతగడ్డపై ఓడించి తమ సత్తాను భారత యువ ఆటగాళ్లు చాటిచెప్పారని అన్నారు. గతంలో అండర్‌-19, భారత-ఎ జట్టుకు ద్రవిడ్‌ కోచ్‌గా ఉండటం వల్లే ఆటగాళ్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. అయితే, అది నా గొప్పతనం కాదని, ఆటగాళ్లు గొప్పగా ఆడారని, క్రెడిట్‌ వాళ్లకే దక్కాలని ద్రవిడ్‌ తనపై వస్తున్న ప్రశంసలను సున్నితంగా తిరస్కరించారు. ఆసీస్‌ పర్యటనలో సత్తా చాటిన శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారి, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు ద్రవిడ్‌ శిక్షణలోనే రాటుదేలారు. కాగా, భారత్‌ ఎ, అండర్‌ -19 కోచ్‌గా ద్రవిడ్‌ 2015 నుండి 2019 వరకు పనిచేశారు. కోచ్‌గా భారత్‌-ఎ తరఫున ఆడారు. గిల్‌, సుందర్‌ భారత అండర్‌-19 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఎన్‌సిఎలో క్రికెట్‌ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించారు.