భారత దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ తనను ఎంతో ఆకట్టుకుందని.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన తన స్వీయ ఆత్మకథ 'బ్లాక్ అండ్ వైట్'లో ఆయన వెల్లడించిన విషయాలు సంచలనం సష్టిస్తున్నాయి. ఆయన 2011లో రాజస్థాన్ జట్టు ఆడినప్పటి సంగతులను రాస్ టేలర్ తన స్వీయ ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు. అప్పుడు రాహుల్ ద్రావిడ్ కూడా రాజస్థాన్ తరపునే ఆడారని.. ఆ సమయంలో పులులను చూసేందుకు తాము రణతంబోర్ జాతీయ పార్క్ కు వెళ్లామని పేర్కొన్నారు. మాటల సందర్భంగా ఎన్నిసార్లు పులిని చూశారని రాహుల్ ద్రావిడ్ ను అడిగానని.. 21 సార్లు వెళ్లినా ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజున మధ్యాహ్నం రాహుల్ ద్రావిడ్ తో కలిసి మళ్లీ జాతీయ పార్క్ కు వెళ్లామని.. ఈ సారి పులి కనిపించిందని రాస్ టేలర్ తెలిపారు. 21 సార్లు వెళ్లినా కనిపించని పులి.. 22వ సారి త్వరగా కనిపించడంతో రాహుల్ ద్రావిడ్ ఆనందం వ్యక్తం చేశారని వివరించారు. తాము పులిని చూస్తూంటే.. పులులను చూడటానికి వచ్చిన జనం మాత్రం ఆ పులిని వదిలేసి, రాహుల్ ద్రావిడ్ ను ఫొటోలు తీయడం మొదలుపెట్టారని తెలిపారు. తాము పులిని చూసిన ఆనందం కంటే వారు రాహుల్ ద్రావిడ్ ను చూసిన ఆనందమే ఎక్కువగా అనిపించిందన్నారు. తనకు తెలిసినంత వరకు ప్రపంచంలో 4వేల పులులు ఉంటాయేమోగానీ.. రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒక్కడేనని.. అందుకే ఆయన పట్ల ఇంత క్రేజ్ అని రాస్ టేలర్ పేర్కొన్నారు.










