Aug 14,2023 15:52

ఫ్లోరిడా: 17 ఏళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌ ఒక సిరీస్‌ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాదు, భారత క్రికెట్‌ చరిత్రలో ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు మ్యాచులు ఓడిపోవడం కూడా ఇదే తొలిసారి. ఈ ఓటమి గురించి టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ స్పందించాడు. ఈ సిరీసులో భారత జట్టు కొన్ని పొరపాట్లు చేసిందని, ముఖ్యంగా బ్యాటింగ్‌ విషయంలో చేసిన తప్పులే కొంప ముంచాయని చెప్పాడు. ఆరంభంలో రెండు ఓటముల నుంచి పుంజుకోవడంలో జట్టు సక్సెస్‌ అయిందని, కానీ సిరీస్‌ను అదే ఊపులో ముగించలేకపోయామని ద్రావిడ్‌ అభిప్రాయపడ్డాడు. 'సిరీసులో మేం కొన్ని పొరపాట్లు చేశాం. ఓవరాల్‌గా ఐదు మ్యాచులు గమనిస్తే మేం చేసిన తప్పులు కనిపిస్తాయి. మొదటి రెండు మ్యాచులు, ఈ చివరి మ్యాచులో కూడా మా బ్యాటింగ్‌ విభాగం అంత గొప్పగా రాణించలేదు. కానీ ఇది యంగ్‌ టీం కాబట్టి అలా జరగడంలో వింతేం లేదు. అందరూ కుర్రాళ్లు, నెమ్మదిగా మెరుగవుతున్నారు' అని ద్రావిడ్‌ చెప్పుకొచ్చాడు. 'ఇది ఎదుగుతున్న టీం కాబట్టి ఎత్తుపల్లాలు సహజమే. అదే సమయంలో విండీస్‌ పెట్టిన ఎఫర్ట్‌ని మర్చిపోకూడదు. వాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ సిరీసులో మేం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓడిపోయినందుకు బాధగానే ఉంది. రెండు ఓటముల నుంచి కోలుకొని రాణించడం గొప్పే. కానీ ఈ మ్యాచ్‌ కూడా గెలిస్తే బాగుండేది. విండీస్‌ చాలా మంచి టీ20 జట్టు' అని ద్రావిడ్‌ పేర్కొన్నాడు.