Aug 26,2023 20:28

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎపి ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఇంటర్నెట్‌, టివి, టెలిఫోన్‌ సౌకర్యాలను తక్కువ ధరకే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కర్నూలు కలెక్టరేట్‌లో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఎపి ఫైబర్‌ నెట్‌ సేవలను సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు అందించడం జరుగుతోందన్నారు. దీనిని మరింత విస్తరించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన డిజిటల్‌ ప్రసారాలను కూడా తమ నెట్‌ ద్వారా అందించేలా అనేక ప్యాకేజీలను పెట్టినట్లు చెప్పారు. కొత్తగా రిలీజ్‌ అయ్యే సినిమాలను థియేటర్లకు వెళ్లకుండా నేరుగా తమ ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రజలు చూసేలా ప్రొడ్యూసర్లతో చర్చలు కూడా జరిపినట్లు తెలిపారు. త్వరలోనే ఈ సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెస్‌ ఆపరేటర్లు ఎపి ఫైబర్‌ నెట్‌ డిజిటల్‌ ప్రసారాలను ప్రజలకు అందేలా సమీక్షలు కూడా చేసినట్లు తెలిపారు. ప్రయివేటు సంస్థలు కూడా తమకు అవసరమైనటువంటి బల్క్‌ నెట్‌ సౌకర్యాన్ని పొందేలా అనేక ప్లాన్లను పెట్టామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని మరింత నాణ్యమైన ఇంటర్నెట్‌ సౌకర్యాలను పొందాలని ఆయన కోరారు.