Sep 25,2023 11:18

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో పక్కా : రాహుల్‌గాంధీ


న్యూఢిల్లీ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లోనూ గెలుస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు. రాజస్థాన్‌లో విజయానికి 'అతి దగ్గర'గా ఉన్నామని చెప్పారు. 'ప్రతిదిన్‌ మీడియా నెట్‌వర్క్‌ ఆఫ్‌ అస్సాం' ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపిని దిగ్భ్రాంతికి గురిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో సంపద కేంద్రీకరణ, సంపదలో భారీ అసమానతలు, తీవ్రమైన నిరుద్యోగం, భారీగా ధరల పెరుగుదల, అట్టడుగు కులాలు, ఒబిసిలు, గిరిజనులకు తీవ్ర అన్యాయం వంటి అనేక ప్రధాన సమస్యలు ఉన్నాయని అన్నారు. 'ఇలాంటి వాస్తవ సమస్యలపై బిజెపి పోరాటం చేయదు. కాబట్టే.. బిధూరి వ్యాఖ్యలు, ఒకే దేశం-ఒకే ఎన్నికలు, దేశం పేరు మార్పు.. వంటి వ్యూహాలను బిజెపి తీసుకుని వస్తుంది. మేం వాటిని ముందుకు వెళ్లనివ్వం' అని చెప్పారు. కుల గణనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని, బిజెపి దానిని అంగీకరించదని రాహుల్‌ తెలిపారు. కులగణన అంశం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే బిజెపి ఎంపీ రమేష్‌ బిధూడీ లోక్‌సభలో బిఎస్‌పి ఎంపీ దానిష్‌ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఇది బిజెపి వ్యూహంలో భాగమేనని చెప్పారు. 'మేం (కాంగ్రెస్‌) ఒక అంశాన్ని తీసుకొచ్చిన ప్రతీసారి...వారు (బిజెపి) మన దృష్టిని మరల్చడానికి (బిధూరి, నిషికాంత్‌ దూబే) లాంటి అంశాలను ఉపయోగిస్తారు. వీటిని ఎలా ఎదుర్కోవాలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత మేం నేర్చుకున్నాం' అని రాహుల్‌ వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల విషయానికి అక్కడ బిజెపి కథ ముగిసిపోయిందని రాహుల్‌ చెప్పారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌, తన ట్విట్టర్‌ అన్నీ కేంద్రం ఒత్తిడికి గురవుతున్నాయని, ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా జాతీయ మీడియాలో వక్రీకరణ లేకుండా సాగదని అన్నారు. 60 శాతం ప్రజల మద్దతున్న ప్రతిపక్ష పార్టీలను మీడియా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్‌ చెప్పారు. తన భారత జోడో యాత్రను జాతీయ మీడియా పట్టించుకోక తప్పని పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.