Aug 25,2023 16:31

న్యూఢిల్లీ : లడఖ్‌ ప్రజల భూముల్ని లాక్కొని.. అదానీ గ్రూపుకు కట్టబెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. శుక్రవారం ఆయన కార్గిల్‌ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మీ భూములను లాక్కొని అదానీ గ్రూప్‌కి అప్పజెప్పేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. మీ భూముల్ని అదానీకి కట్టబెడితే ఆయన.. ఇక్కడ ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ ప్లాంట్‌ వల్ల వచ్చే లాభాల్ని మీకు పంచరు. మీ భూముల్ని అదానీ గ్రూపుకు ఇవ్వకుండా మీరే అడ్డుకోవాలి' అని రాహుల్‌ లడఖ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. లడక్‌ వ్యూహాత్మక ప్రదేశం. ఇక్కడున్న భారత భూభాగాన్ని చైనా తీసుకుంది. కానీ ప్రధాని మోడీ మాత్రం చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని చెబుతున్నారు. ప్రధాని చెప్పేవన్నీ అసత్యాలే అని రాహుల్‌ పేర్కొన్నారు. కొద్దినెలల కిందట తాను చేపట్టన భారత్‌ జోడో యాత్రలో భాగంగా లడఖ్‌లో చేరుకోవాలనుకున్నా.. అప్పుడు హిమపాతం కారణంగా ఈ ప్రాంతాన్ని సందర్శించలేకపోయినట్లు రాహుల్‌ చెప్పారు. అయితే ఈసారి బైక్‌పై లడఖ్‌కి చేరుకుని యాత్ర కొనసాగించినట్లు రాహుల్‌ తెలిపారు.