Aug 30,2023 15:47

మైసూర్‌ : ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాన్ని కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లకు ఇచ్చిన హామీలను వరుసగా సిద్ధరామయ్య ప్రభుత్వం అమలుపరుస్తోంది. తాజాగా బుధవారం 'గృహలక్ష్మీ' పథకాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మైసూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్‌గాంధీ మట్లాడుతూ.. 'ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన 'గృహలక్ష్మీ' పథకాన్ని ఈరోజు ప్రారంభించాం. ఈ పథకం కింద బిపిఎల్‌ కుటుంబాల్లోని మహిళా పెద్దలకు నెలకు రెండు వేల రూపాయల్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోట్లాది మహిళలకు తమ బ్యాంక్‌ అకౌంట్లలో రెండు వేల రూపాయల్ని ప్రభుత్వం జమ చేసింది. ట్యాబ్‌పై ఒక్క క్లిక్‌తోనే కోట్లాది మంది మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయి. ప్రతినెలా మహిళల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ అవుతాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ గానీ, నేతలు గానీ ఏదైనా చెబితే.. కచ్చితంగా వాటిని అమలు చేస్తాం' అని అన్నారు. అలాగే ఎన్నికల క్యాంపెయిన్‌లో మహిళలు బస్సు ప్రయాణానికి ఎలాంటి చెల్లింపులు లేకుండా..'శక్తి' పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పాం. ఆ హామీని కూడా నెరవేర్చాం అని రాహుల్‌ గాంధీ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు వాగ్ధానాల్లో నాలుగు హామీలు మహిళలకు సంబంధించినవే. ఎంతో లోతైన ఆలోచనతోనే ఈ హామీల్ని ఇచ్చాం అని రాహుల్‌ అన్నారు.
కాగా, మైసూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోఫాల్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సంక్షేమ పథకం ఇది. 1.28 కోట్ల కుటుంబ మహిళా పెద్దలకు ఈ పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది' అని అన్నారు.