గయానా: టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే వెస్టిండీస్ జట్టును సెలెక్టర్లు మంగళవారం ప్రకటించారు. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన దృష్ట్యా కీలక ఆటగాళ్లను తిరిగి జట్టులో చోటు కల్పించింది. షిమ్రాన్ హెట్‌మెయిర్, ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్‌లను వన్డేలకు ఎంపిక చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత వీళ్లకు పిలుపు రావడం విశేషం. 'హెట్‌మెయిర్, ఒషానే థామస్‌లను మళ్లీ జట్టులోకి స్వాగతిస్తున్నాం. ఇంతకుముందు వీళ్లిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. విజయవంతం కూడా అయ్యారు. వీళ్లు జట్టు కూర్పులో సరిగ్గా సరిపోతారని నమ్ముతున్నాం' అని చీఫ్ సెలెక్టర్ డెస్మాండ్ హేనేస్ ఓ ప్రకటనలో తెలిపాడు. పేసర్ జరుడెన్ సీల్స్, లెగ్ స్పిన్నర్ యన్నిక్ కరియలకు కూడా 15మంది బందంలో చోటు కల్పించారు. వీళ్లిద్దరూ ఈమధ్యే సర్జరీ నుంచి కోలుకుని రిహబిలిటేషన్ సెంటర్‌లో ఫిట్‌నెస్ సాధించారు. మరో స్పిన్నర్ గుడకేశ్ మోతీ కూడా వన్డే జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. గాయపడిన ఆల్‌రౌండర్ కీమో పాల్, మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్, సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హౌల్డర్‌కు వన్డే సిరీస్‌కు దూరం అయ్యారు. జూలై 27 నుంచి వన్డే సిరీస్ నుంచి ప్రారంభం కానుంది.
జట్టు : షై హౌప్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, యాన్నిక్ కరియ, కేసీ కార్టి, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్‌మెయిర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోతీ, జేడెన్ సీలెస్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లెయిర్, ఒషానే థామస్.










