Apr 23,2023 21:00

- ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ
ప్రజాశక్తి- పలాస (శ్రీకాకుళం జిల్లా):
జీడి పిక్కలకు మద్దతు ధర కల్పించాలని, 80 కిలోల బస్తాకు రూ.16 వేలు చెల్లించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, ఆలిండియా కిసాన్‌ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరనాథ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని లాస్య ఫంక్షన్‌ హాల్‌లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు అధ్యక్షతన జీడి రైతుల సదస్సు ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే జీడి పిక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం జీడికి మద్దతు ధర కల్పించకపోవడంతో జీడి రైతులు దళారుల దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళ మాదిరిగా జీడి పంటకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, వాతావరణ బీమా అమలు చేయాలని కోరారు. జీడి పంట అభివృద్ధికి ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా నిధులు అందించాలని, జీడి పిక్కలు, జీడి పళ్ల ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడిపప్పు ధర పెరుగుతున్నా, పిక్కల ధర మాత్రం గణనీయంగా తగ్గిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని మద్దతు ధర ప్రకటించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జీడి రైతులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం జీడి రైతుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా తెప్పల అజరు కుమార్‌, కమిటీ సభ్యులుగా డి.తాతారావు, టి.భాస్కరరావు, ఎస్‌.కుమార్‌, కె.ధనరాజు, ఆర్‌.పురుషోత్తం, కె.పురుషోత్తం, ఎం.రామారావు, పి.కుసుమతోపాటు 26 మందిని ఎన్నుకున్నారు. సదస్సులో సిఐటియు నాయకులు ఎన్‌.గణపతి, బి.రామకృష్ణ నాయుడు, ఎస్‌.గోపి, కె.హేమసూదన్‌, పలాస, మందస, సోంపేట, వజ్రపుకొత్తూరు మండలాల్లోని జీడి రైతులు పాల్గొన్నారు.