Aug 30,2023 12:51
  • ఏటా పడిపోతున్న సాగు విస్తీర్ణం
  • గిట్టుబాటు కాకపోవడమే కారణం

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా అంటేనే గుర్తుకొచ్చేది కరువు... వేరుశనగ పంట. దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం కలిగిన ఈ ప్రాంతంలో తక్కువ వర్షానికైనా పండగలిగే పంట వేరుశనగ ఒక్కటే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏటా ఈ పంటను సాగు చేస్తున్నారు. ప్రకృతి తోడ్పాటు, ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఈ ప్రాంత రైతుల్లో దశాబ్దకాలంగా వేరుశనగ సాగుపై ఆసక్తి తగ్గుతూ వస్తోంది. దీంతో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ పంట సాగు విస్తీర్ణం ప్రస్తుతం గణనీయంగా పడిపోయింది. 2011లో 20.11 లక్షలు సాగయ్యేది. క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 4.77 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గత 13 ఏళ్లలో 15.41 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది.
 

                                                                     పెరుగుతున్న పెట్టుబడులు

వేరుశనగ సాగు పెట్టుబడి ఏటా పెరిగిపోతోంది 2011లో ఎకరం విస్తీర్ణంలో వేరుశనగ సాగుకు రూ.7,084 ఖర్చయ్యేది.ప్రస్తుతం ఈ ఖర్చు రూ.32 వేలకు చేరింది. దాదాపు నాలుగు రెట్లు పెట్టుబడి వ్యయం పెరిగింది. అందుకు తగ్గట్టు పంట దిగుబడులు లేకపోవడం, వర్షాభావంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. 2017లో అత్యధికంగా ఎకరానికి 441 కిలోల దిగుబడి వచ్చింది. మిగతా ఏ సంవత్సరం కూడా 300 కిలోలకు మించి రాలేదు. తీవ్ర వర్షాభావం వల్ల 2016లో ఎకరానికి 87 కిలోలే దిగుబడి వచ్చింది.
 

                                                                  దీమా ఇవ్వని వాతావరణ బీమా

వేరుశనగ పంటకు నష్టం జరిగితే బీమా రూపంలో ప్రభుత్వం రైతులను ఆదుకునేది. 2011కు ముందు వరకూ త్రెస్‌హోల్డ్‌ ప్రకారం అంటే, మూడేళ్ల సగటు దిగుబడిని లెక్కించి దాని కంటే తక్కువ దిగుబడి వస్తేనే బీమా వచ్చేది. దీనివల్ల ప్రయోజనం లేదని బీమా విధానంలో మార్పులు తీసుకొ చ్చారు. 2011 నుంచి వాతావరణ బీమాను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. పంట కాలాన్ని మూడు భాగాలుగా విడగొట్టి ఆ కాలంలో కురిసే వర్షపాతాన్ని బట్టి రైతులకు పరిహారం అందించే పద్ధతిని తీసుకొచ్చింది. ఈ విధానంలోనూ రైతులకు పరిహారం సరిగా రావడం లేదు. ఓ వైపు వర్షాలు లేక దిగుబడి రాకపోవడం, మరోవైపు ప్రభుత్వ సాయం లేకపోవడం వేరుశనగ సాగుపై రైతుల్లో ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణం.

55

                                                                       బీమా విధానంలో మార్పు తేవాలి

అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితుల్లో ప్రధానంగా పండేది వేరుశనగ పంట ఒక్కటే. ప్రభుత్వం ఈ పంటకు తగినంత ప్రోత్సాహకం అందివ్వాలి. ఇప్పుడున్న బీమా విధానం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా ఉంది. వాతావరణ బీమా కాకుండా దిగుబడి ఆధారంగా బీమా వర్తింపజేయాలి. అది కూడా గతంలోలాగా సగటు దిగుబడి కాకుండా పెట్టుబడి ఆధారంగా రైతును ఆదుకునే విధంగా బీమాలో మార్పులు చేయాలి. ప్రభుత్వం స్పందించి వేరుశనగ రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలి.
                                                - చంద్రశేఖర్‌రెడ్డి, ఎపి రైతు సంఘం అనంతపురం జిల్లా కార్యదర్శి

12