ప్రజాశక్తి - బుక్కరాయసముద్రం ( అనంతపురం) :టీవల కురిసిన అకాల వర్షాలకు, ఈదురుగాలులకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్‌ఎస్.శ్రీధర్ తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామంలో వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను ఆదివారం ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పంటసాగు, పెట్టుబడి, పంట కోత వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పులు చేసి కాకర పంట సాగుచేశానని, వర్షాలకు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయానని గ్రామానికి చెందిన రైతు జనార్థన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తీగజాతి పంటలను రాళ్లపందిరి ద్వారా సాగు చేస్తే ఇలాంటి అకాల వర్షాలకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని సూచించారు. రైతులు అధైర్యపడొద్దని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు. మరో రైతు రాజశేఖర్ సాగు చేస్తున్న కొత్తరకం విఎన్‌ఆర్ జామ తోటను ఆయన పరిశీలించి మార్కెటింగ్‌కి అనుకూలమైన విషయాలు, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ మండల అధికారి శైలజ మండలంలోని సాగుచేసిన పంట వివరాలను కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ ఇన్‌ఛార్జ్, గుంటూరు కార్యాలయ డిడిహెచ్ ధర్మజ, జిల్లా ఉద్యాన శాఖ ఇన్‌ఛార్జి నరసింహారావు, ఎపిఎంఐపి పిడి ఫిరోజ్, సత్యసాయి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు,










