Oct 18,2023 21:50

- యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ
ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా):సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలే మార్గమని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావమ్మ తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని సిఐటియు కార్యాలయంలో యూనియన్‌ మంగళగిరి ప్రాజెక్టు సమావేశం బుధవారం జరిగింది. యూనియన్‌ నాయకులు హేమలత అధ్యక్షతన జరిగిన సదస్సులో సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కంటే అదనపు వేతనం ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఏళ్ల తరబడి టిఎలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేతనాలు కూడా ఏడాదికి రెండు నెలలు ఇవ్వడం లేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రయివేటుపరం చేయలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్‌వాడీ సెంటర్లను విలీనం పేరుతో మూసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోగా సిఐటియు పోరాటాల వల్ల కొంతవరకు వెనక్కు తగ్గిందన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా గౌరవాధక్షులు వై.నేతాజీ, సిఐటియు నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.