ప్రజాశక్తి - కుప్పం, గుడిపల్లి :'అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరిస్తా' అని నారా చంద్రబాబునాయుడు అన్నారు. రెండో రోజు రోడ్డు షోలో భాగంగా అంగన్‌వాడీల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు మాట్లాడుతూ పనిభారం ఎక్కువ మోపుతున్నారని, అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు.
కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు కుప్పం ఆర్‌టిసి బస్టాండ్ ప్రాంగణంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. 'మీరు అండగా ఉంటే మీ భవిష్యత్ నా బాధ్యత' అని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. 2024లో అధికారం తమదేనని, అక్రమ కేసులకు భయపడకుండా పార్టీ బలోపేతానికి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. సూపర్ సిక్స్ మినీ మ్యానిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మునిరత్నం, కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్.చంద్రశేఖర్, త్రిలోక్ తదితరులు పాlల్గోన్నారు.
అంతకుముందు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిసిఎన్ కల్యాణ మండపంలో కుప్పంకు చెందిన ప్రముఖ వైద్యులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో వెయ్యిమంది కాంగ్రెస్ శ్రేణులు, వైసిపి కార్యకర్తలు దాదాపు 800 మంది టిడిపిలో చేరారు. గ్రూపు రాజకీయాలు చేస్తే సహించబోనని ,మెజార్టీ పెంచుకునేలా శ్రేణులు కలసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 'ప్రజాబలమే నా బలం .. రానున్నది మన ప్రభుత్వమే' అని ఉద్ఘాటించారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహం వద్ద స్థానికుల నుంచి అర్జీలను స్వీకరించారు.










