ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :రాజకీయ వేధింపులు ఆపాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీలు బుదవారం ధర్నా చేశారు. తొలుత జడ్‌పి సెంటర్‌లో నిరసన తెలిపి, అక్కడ నుంచి కలెక్టరేట్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, సెల్ ఫోన్లు ఇచ్చేంత వరకు ఆన్‌లైన్ పనిని నిలిపేయాలని నినదించారు. ధర్నాను ఉద్దేశించి అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్ మాట్లాడారు. సమస్యలపై ఐసిడిఎస్ అధికారులతో చర్చించేందుకు వెళుతున్న అంగన్‌వాడీలను నిర్బంధించడం తగదన్నారు. సామర్లకోట, పిఠాపురం ప్రాంతాల నుంచి వస్తున్న వారిని మధ్యలోనే అడ్డుకుని ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. అధికార పార్టీ కార్యక్రమాలకు లేని నిషేధాన్ని ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలపై ఎందుకు విధిస్తున్నారన్నారు. ఉదయం 6 గంటల నుంచి సిఐటియు నాయకుల, అంగన్‌వాడీ సాధారణ కార్యకర్తల ఇళ్లకు పోలీసులను పంపి గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.










