ప్రజాశక్తి - ఆమదాలవలస (శ్రీకాకుళం) :సిడిపి అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని సమగ్ర శిశుఅభివృద్ధి పథకం అధికారి కార్యాలయం వద్ద అంగన్వాడీలు శనివారం నిరసన చేపట్టారు. ప్రభుత్వం బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పంచాది లతాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం ఉదయం 9.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ సిడిపి అధికారులు నాలుగు గంటల తరువాత తనిఖీలకు రావడంతో అదనపు సమయం వెచ్చించాల్సి వస్తోందన్నారు. తనిఖీ సమయంలో చిన్న చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి చూస్తున్నారని, అనవసరంగా షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడి మేరకు నెలిపర్తి అంగన్వాడీ జి పద్మకు మోమోలు జారీ చేయడం తగదన్నారు. ప్రభుత్వం 2017 నుంచి కూరగాయలు, గ్యాస్, ఇంటి అద్దె తదితర బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని వాపోయారు. నెల రోజుల్లో 15 రోజులు సిడిపిఒ కార్యాలయానికి వివిధ కార్యక్రమాల్లో పాల్గంటున్నామని చెప్పారు. సమావేశాలకు రవాణా, ఇతర భత్యాలను ఇంతవరకు చెల్లించలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి పి భూలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు జె పద్మ, అరుణ, లక్ష్మి, నాగమణి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.










