Aug 19,2023 09:36
  • ఎగువ నుంచి జలాశయానికి రాని నీళ్లు
  • గరిష్ట నిల్వకు సగం కూడా లేని వైనం
  • వరి సాగుపై కొనసాగుతున్న సందిగ్ధత

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : పైనుంచి నీళ్లు రాకపోవడంతో నాగార్జున సాగర్‌ ఆయకట్టులోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో కుడికాలువ కింద 11 లక్షల ఎకరాల్లో సాగు అనిశ్చితిలో పడింది. ఈ ఆయకట్టు కింద సుమారు రెండు లక్షల్లో వరి సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కలిపి కేవలం 2,200 ఎకరాల్లోనే వరి సాగులో ఉంది. అంటే కేవలం ఒక్క శాతం విస్తీర్ణంలోనే వరి నాట్లు పడ్డాయి. ప్రకాశం జిల్లాలో 38 వేల ఎకరాల్లో, పల్నాడు జిల్లాలో 1.22 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉంది. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా కుడి కాలువ కింద కొంత ఆయకట్టు ఉంది. ఈ కాల్వలకు నీరు వచ్చే అవకాశాన్ని బట్టి 40 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. మొత్తంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఏడాది వరి సాగుపై అయోమయం నెలకొంది. సాగర్‌ జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వ లేకపోవడంతో ఈ ఏడాది వరి సాగుకు నీరందించే విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాలలో కొంతమేరకు నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నా కృష్ణా పరివాహక ప్రాంత కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో పెరగడం లేదు. దీంతో, దిగువకు నీటి విడుదల జరగడం లేదు. ఆల్మట్టి నుంచి వరద ప్రవాహం దిగువకు రాకపోవడంతో గత రెండు నెలలుగా సాగర్‌ జలాశయంలో నీటి నిల్వ పెరగలేదు. గతేడాది ఇదే సమయానికి కృష్ణా పరివా హక ప్రాంత అన్ని జలాశయాల్లోనూ నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది నిరాశాజనకంగా పరిస్థితి ఉంది. మరోవైపు సాగర్‌ ఆయకట్టు పరిధిలో దాదాపు 30 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, పత్తి పంట ఇతర పంటలపై రైతులు దృష్టి సారించడం లేదు. సాగర్‌ జలాశయంలో నీరులేకపోవడంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఏడాది మిర్చి సాగు కూడా ఇంతవరకూ ఊపందుకోలేదు. మిర్చికి తప్పనిసరిగా రెండు మూడు నీటి తడులు అవసరం. నీరు విడుదల కాకపోతే మిర్చి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఆగస్టు మూడవ వారం వచ్చినా ఇంతవరకు 50 శాతం కూడా సాగు జరగలేదు. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ మిగతా 7లో 215.80 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 108.75 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. ఈ జలాశయానికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రావడం లేదు. గతేడాది ఆగస్టు 18 నాటికి 211.48 టిఎంసిల నీరు నిల్వ ఉంది. సాగర్‌ జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.04 టిఎంసిలు. ప్రస్తుతం 148.73 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 296.86 టిఎంసిలు ఉండేవి. ఆల్మట్టిలో గరిష్ట నీటి నిల్వ 129.72 టిఎంసిలు కాగా, ప్రస్తు తం 128.19 టిఎంసిలు ఉన్నాయి. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరగకపోవడంతో దిగువకు నీటిని విడుదల చేయడం లేదు. ఇదే పరిస్థితి నారాయణ్‌పూర్‌, జూరాల జలాశయాల వద్ద కూడా ఉంది. గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే కృష్ణా డెల్తా, సాగర్‌ ఆయకట్టుకు నీరు రావడం ప్రారంభమైందని, ఈ ఏడాది ఆల్మట్టి నుంచి నీటి విడుదల జరిగితేనే సాగర్‌ ఆయకట్టు రైతులకు ఇబ్బంది ఉండదని, అప్పటి వరకు వేచిచూడక తప్పదని అధికారులు చెప్తున్నారు.