Feb 22,2023 12:20
  • విస్తీర్ణం తగ్గినా పెరిగిన నీటి వినియోగం !
  • లస్కర్లు లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : నాగార్జున సాగర్‌ జలాశయంలో గత నాలుగేళ్లుగా నీటి నిల్వలు పుష్కలంగా ఉంటున్నా సాగు విస్తీర్ణం పెరగడం లేదు. వర్షాలు ఆశాజనకంగా ఉంటున్నాయి. నాలుగేళ్లుగా ఏటా జులై చివరి నుంచి సెప్టెంబరు వరకు వరదలు వస్తున్నాయి. అయితే, ఖరీఫ్‌లో మాత్రం ఆయకట్టు పరిధిలో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. 2018-19లో 10.16 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 111.71 టిఎంసిల నీటిని అధికారులు విడుదల చేశారు. 2019-20లో 11.12 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 160.26 టిఎంసిల నీరు విడుదలైంది. 2020-21లో 10.83 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. 159.80 టిఎంసిల నీటిని అధికారులు విడుదల చేశారు. 2021-22లో 9.30 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. అయితే, 166.15 టిఎంసిల నీటిని విడుదల చేశారు. 2022-23లో 9.25 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈ నెల 15 నాటికి 159.98 టిఎంసిల నీటి వినియోగం జరిగినట్లు అధికారుల రికార్డులు చెప్తున్నాయి. 2019-20లో కన్నా ప్రస్తుత ఏడాది 1.87 లక్షల ఎకరాల్లో తక్కువగా పంటలు సాగయ్యాయి. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో వరి సాగు గణనీయంగా తగ్గింది. అయినా, నీటి వినియోగం పెరిగిందని అధికారులు చెప్తున్నారు. కాలువల నుంచి నీటిని పొలాలు తడవడానికి అందిస్తున్నారు. అదనంగా వస్తున్న నీటిని వాగుల్లోకి వదిలివేస్తున్నారు. మేజరు కాల్వల నుంచి మైనర్‌ కాల్వలకు విడుదల చేసిన నీటిపై సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. మైనరు కాల్వల్లో ఎక్కడికక్కడ షట్లర్లు దెబ్బతినడం, పంటలకు నీరందించిన తరువాత షట్టర్లు మూసివేయకపోవడంతో నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. కాలువల ఆధునీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన షట్టర్లు తక్కువ కాలంలోనే మరమ్మతులకు గురయ్యాయి. కాలువ వెంబడి తిరుగుతూ నీటిని అవసరాలకు అనుగుణంగా విడుదల చేయాల్సిన లస్కర్లు లేకపోవడంతో వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై పర్యవేక్షణ కొరవడింది. ప్రస్తుతం ఏ కాలువ కింద ఎంత ఆయకట్టు సాగులో ఉంది? ఏ పంటలు సాగులో ఉన్నాయి? కాలువలకు విడుదల చేస్తున్న నీరు సక్రమంగా చేరుతుందా? లేదా? పూర్తి స్థాయిలో వినియోగం అవుతుందా? లేదా వంటి వాటిని పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. దీంతో, ఏ ప్రాంతంలో నీరు సక్రమంగా రాకపోతే ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన చేస్తే హడావుడిగా నీటిని విడుదల చేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు.
          2014-2018 మధ్య కాలంలో నాలుగేళ్లపాటు నీరులేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది నీరు పుష్కలంగా ఉన్నా నిర్వహణ లోపాల వల్ల రైతులకు ఇబ్బందులు తప్పలేదు. క్షేత్ర స్థాయిలో లస్కర్ల లేరన్న కారణంతో వివిధ స్థాయిలోని అధికారులు కూడా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తక్కువ సాగుకు ఎక్కువ నీటి వినియోగం జరిగినట్టు రికార్డుల్లో నమోదైంది.