Aug 30,2023 16:32

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు రకాల ఓట్ల తొలగింపునకు సంబంధించిన రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ పి.రాజాబాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ ఓటరు నమోదు అధికారులు (ఈ ఆర్‌ ఓ లు),ఏ ఈ ఆర్‌ ఓ లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఓట్ల తొలగింపు, నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జి ఈ ఆర్‌) తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈఆర్వోలు అందరూ ఇదివరకు మృతి చెందిన, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నా, శాశ్వతంగా వలస వెళ్లడంతో తొలగించిన మూడు రకాల ఓట్లలో యాదృచ్ఛికంగా 500 కేసులను క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా సంబంధిత రికార్డులను, జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎవరైనా వాటికి సంబంధించి అభ్యంతరం చెబితే ఆయా ఈఆర్వోలు బాధ్యులవుతారని స్పష్టం చేశారు.నిజమైన ఓట్లను ఎట్టి పరిస్థితులను తొలగించరాదని దీనిపై భారతీయ ఎన్నికల సంఘం చాలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. తొలగించిన ఓట్లకు సంబంధించిన రికార్డులు తయారు చేయుటకు బూతు స్థాయి అధికారులు 5 రోజులు అడిగినప్పటికీ ఇప్పటికే 10 రోజులు కావలసినంత సమయం ఇవ్వడం జరిగిందన్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు ఉండరాదని నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత బూత్‌ సాయి అధికారులను సస్పెండ్‌ చేయడం గాని చార్జి మెమో జారీ చేయడం గానీ జరుగుతుందని హెచ్చరించారు. ఈఆర్వోలు పరిశీలించిన 500 కేసుల్లో తాను కూడా మరలా పరిశీలిస్తానన్నారు. మచిలీపట్నంలో ముఖ్యంగా అన్ని రికార్డులు పక్కాగా ఉంచుకోవాలని రెండు వందల శాతం పరిశీలన చేయాలన్నారు. జిల్లాలో విద్య వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా స్థూల నమోదు నిష్పత్తిని (జి ఈ ఆర్‌ )నూటికి నూరు శాతం సాధించాలన్నారు. విద్యా, సామాజిక అభివద్ధి ప్రాధాన్యత అంశాలున్నారు. గ్రామ వార్డు సచివాలయాల సంక్షేమ, విద్యా కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించి వారి పరిధిలో గల వాలంటీర్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.జిల్లాలో 5 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ బడిలో గాని కళాశాలలో కానీ చేరి ఉండాలని స్పష్టం చేశారు. వారు రెగ్యులర్‌ లేదా సార్వత్రిక (ఓపెన్‌) విద్యాసంస్థల్లో ఏదో ఒకచోట చేరి ఉండాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌,డి ఆర్‌ ఓ, ఎం వెంకటేశ్వర్లు, ఏడు నియోజకవర్గాల ఈ ఆర్‌ ఓ లు ఐ కిషోర్‌, పద్మావతి, శివ నారాయణ రెడ్డి, పార్వతి, రాజ్యలక్ష్మి, చంద్రలీల, శ్రీనివాసరావు, డిఇఓ తహేరా సుల్తానా, డి ఎల్‌ డి ఓ సుబ్బారావు, తహసిల్దార్లు ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, గ్రామ వార్డు సచివాలయాల సంక్షేమ విద్య కార్యదర్శులు తదితర అధికారులు పాల్గొన్నారు.
.