ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : జిల్లాల పునర్విభజనకు పూర్తిస్థాయి గణాంకాలు అందజేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లాల పునర్విభజనపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో అవగాహన సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాల వివరాలతో పాటు ఇతర సమాచారాన్ని పూర్తిస్థాయిలో నివేదించాలని సూచించారు. వాటిని ప్రభుత్వం కచ్చితమైన సమాచారంతో అప్‌లోడ్ చేయాలన్నారు. జిల్లాల పునర్విభజనపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాస్థాయి, డివిజన్, మండల స్థాయిలో కార్యాలయాలు నిర్వహిస్తున్న సొంత భవనాల వివరాలను, అద్దె భవనాల వివరాలను, వేకెంట్ ల్యాండ్ కలిగి ఉన్న సొంత భవనాల వివరాలను అప్‌లోడ్ చేయాలన్నారు. వీటిని అప్‌లోడ్ చేసేందుకు మోడ్యూల్ సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పంపించాలన్నారు. ప్రభుత్వ శాఖకు చెందిన ఖాళీ స్థలాలను పొందుపరిచినప్పుడు ఆర్‌డిఒ స్థాయి అధికారి ఆ స్థలాన్ని పరిశీలించాలన్నారు. ఆయన ధ్రువీకరించాక పూర్తి వివరాలు అందులో పొందుపరచాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ శాఖల వారీగా యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌లను ఇచ్చినట్లు తెలిపారు. అనుమానాల నివృత్తికి ఇడిఎం ఇంద్రశేఖర్ 833989277ను సంప్రదించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా ఖజానాధికారి నిర్మలమ్మ, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










