Sep 26,2023 10:13
  • ఉపాధి, ఆహార, సామాజిక భద్రత కోసం కొల్‌కతాలో వ్యవసాయ కార్మిక సంఘం భారీ బహిరంగ సభ
  • రూ.600 వేతనంతో ఏడాదికి 200 రోజుల 'ఉపాధి' కల్పించాలి
  • విజయరాఘవన్‌, వెంకట్‌ డిమాండ్‌
  • కార్పొరేట్‌ మతోన్మాద ఆటవిక విధానాలను ఓడించాలని పిలుపు

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌ - కొల్‌కతా : కేంద్రంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వ విధానాలకు, బెంగాల్‌లో మమత బెనర్జీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ ఆటవిక విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది కష్టజీవులు కలకత్తా వీధులలో కదం తొక్కారు. బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ కుట్రలను ఎర్రజెండా అండతో అడ్డుకుందామంటూ గొంతెత్తి నినదించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొల్‌కతాలో కష్టజీవుల మహాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎడబ్ల్యుయు జాతీయ అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఎ విజయ రాఘవన్‌, బి వెంకట్‌, పార్లమెంటు సభ్యులు వికాసరంజన్‌ తదితరులు ప్రసంగించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.600 వేతనంతో ఏడాదికి కనీసం 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఆహార ధాన్యాలను ప్రజలకు ఉచితంగా అందజేయాలని కోరారు. పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, సామాజిక ఫించన్లు అందజేయాలని డిమాండ్‌ చేశారు.
          తృణమూల్‌ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించి, పోలీసులతో తీవ్ర నిర్బంధానికి పాల్పడినా..వాటన్నిటినీ లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన కష్టజీవులకు వారు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకోవాలంటే కేంద్రంలో మోడీని, బెంగాల్‌లో మమత బెనర్జి ఓడించితీరాలని పిలుపునిచ్చారు. తృణమూల్‌ అవినీతి పాలనతో బెంగాల్‌లో ఉపాధి హామీ పథకం నిర్వీర్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల జాబు కార్డులన్నీ తమ కబంధహస్తాల్లో దాచుకొని 'ఉపాధి' నిధులను పందికొక్కుల్లా తృణమూల్‌, బిజెపి నేతలు దిగమింగుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనివల్ల పేదలు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి, తృణమూల్‌ జోడిగా బెంగాల్‌ ప్రజలను బలి పశువులను చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా అక్టోబర్‌ 11న బెంగాల్‌ గ్రామీణ ప్రాంతాన్నంత స్తంభింపచేస్తామని, జిల్లా స్థాయిలో, బ్లాక్‌ స్థాయిలో దిగ్బంధనాలకు దిగుతామనిహెచ్చరించారు.
             వ్యవసాయ రంగంలోనూ బెంగాల్‌ అట్టడుగు స్థానానికి చేరిందని, దేశ జిడిపిలో 25% వ్యవసాయ రంగం నుండి వస్తుంటే బెంగాల్‌లో కేవలం 16 శాతం వస్తోందన్నారు. వామపక్ష ప్రభుత్వాలు గ్రామీణ పేదలకు లక్షలాది ఎకరాల భూములు పంచాయిని, పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాయని తద్వారా గ్రామీణ వ్యవసాయం నాడు సస్యశ్యామలంగా సాగిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి ప్రసిద్ధిగాంచిన బర్డ్వాన్‌ లాంటి జిల్లాలోనూ రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
            మతోన్మాద బిజెపి, అరాచక తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాల అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్న వీరిని ఓడించితీరితేనే దేశంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోనూ ప్రజాస్వామ్య హక్కులకు మనుగడ సాధ్యమని తెలిపారు. ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నేతలు అమియా పాత్ర, తోషార్‌ ఘోష్‌, రాష్ట్ర కార్యదర్శి మీరా ఫర్‌ సర్దార్‌ తదితరులు పాల్గొన్నారు.