Aug 26,2023 08:22
  • సీడ్‌ పంపిణీ చేయకుండానే చేసినట్లు రికార్డులు
  • రైతుల వేలిముద్రలు హైజాక్‌
  • వ్యవసాయశాఖ, సప్లయర్స్‌ కుమ్మక్కు
  • ఉమ్మడి అనంతలో అక్రమాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వర్షాభావం, సేద్యంపై రైతుల అనాసక్తి పరిస్థితులను తమకనుకూలంగా మార్చుకున్న వ్యవసాయశాఖ, ఎపి సీడ్స్‌, ఆర్‌బికెల అధికారులు, ప్రైవేటు సప్లయర్స్‌ రింగై వేరుశనగ విత్తన సబ్సిడీని నొక్కేశారు. ఈ ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన విత్తనాలను రైతులకు చేర్చకుండా కాగితాలపై పంపిణీ చేసినట్లు నమోదు చేసి కోట్ల రూపాయలు పంచుకున్నారు. వేరుశనగ అధికంగా సాగయ్యే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇంకా ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఇటువంటి అక్రమాలే చోటు చేసుకున్నట్లు సమాచారం. అక్రమాల వెనుక ప్రభుత్వంలోని కొందరు 'పెద్దల' పాత్ర కూడా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
 

                                                                         మాస్టర్‌ ప్లాన్‌

2023-24 ఖరీఫ్‌లో దాదాపు 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. రెండు లక్షల క్వింటాళ్ల వరకు ఉమ్మడి అనంతపురానికి కేటాయించారు. టెండర్ల ద్వారా ప్రైవేటు సప్లయర్స్‌ నుంచి విత్తనాలను సేకరించాలనుకున్నారు. భౌతికంగా ఇండెంట్‌లో కొంత మేరకే సేకరించారు. ఆలస్యంగా మే 29న విత్తనాల పంపిణీని ఆర్‌బికెలలో ప్రారంభించారు. తొలినాళ్లలో అరకొరగా వచ్చిన విత్తనాలు నాలుగు రోజుల్లోనే అయిపోయాయి. అనంతరం నెమ్మదిగా ఆర్‌బికెలకు విత్తనాలు పంపారు. సీజన్‌ ఆరంభం నుంచీ వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, రైతులు వేరుశనగ సాగు పట్ల అనాసక్తిగా ఉండటాన్ని గమనించిన వ్యవసాయశాఖ, ఎపి సీడ్స్‌, ఆర్‌బికె అధికారులు, సప్లయర్స్‌ ప్రభుత్వ సబ్సిడీని కొట్టేయడానికి మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. రైతులకు పంపిణీ చేసే నిమిత్తం సేకరించి గోదాముల్లో పెట్టిన విత్తనాలను కదిలించకుండా, ఆర్‌బికెలకు డెలివరీ చలాన్లు (డిసి) పంపి, అక్కడికి లోడు చేరినట్లు కాగితాలపై రాసి, ఆపై రైతులకు పంపిణీ చేసినట్లు పత్రాలు సృష్టించారు. ఆర్‌బికెలకు విత్తనాల లారీలు రాకుండానే వచ్చినట్లు రికార్డులు రూపొందించారు. ఎరువుల పంపిణీ, పిఎం కిసాన్‌ వంటి పథకాల నిమిత్తం రైతుల నుంచి సేకరించిన డిజిటల్‌ వేలిముద్రలను చాకచక్యంగా విత్తనాల పంపిణీకి ఉపయోగించారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేయకుండా చేసినట్లు పత్రాలు తయారు చేశారు. వేరుశనగకు ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాలుకు నిర్ణయించిన సబ్సిడీ రూ.3,720. అది పోను రైతు రూ.5,580 చెల్లించాలి. రైతు వాటా నాన్‌ సబ్సిడీ అమౌంట్‌ను మినహాయిస్తే క్వింటాలుకు రూ.3,720 సబ్సిడీ వస్తుంది. విత్తనాలు పంపిణీ చేయకుండానే సబ్సిడీ అమౌంట్‌ను పంచుకున్నారు. రైతుల తరఫున సప్లయర్సే నాన్‌ సబ్సిడీ అమౌంట్‌ కట్టారు. ఉమ్మడి అనంతపురంలో పంపిణీ చేశామంటున్న రెండు లక్షల క్వింటాళ్లలో సుమారు 20 శాతం (40 వేల క్వింటాళ్లు) వరకు ఈ విధంగానే చేతులు మారాయని ఆరోపణలొస్తున్నాయి. రూ.10-15 కోట్ల వరకు కొట్టేశారని సమాచారం.
 

                                                                          వాటాలేసుకున్నారు..

ఒక లారీలో 90 క్వింటాళ్ల వరకు రవాణా అవుతాయి. లారీకి సర్కారు ఇచ్చే సబ్సిడీ దాదాపు రూ.మూడున్నర లక్షలు. రూ.లక్షన్నర వరకు వ్యవసాయశాఖకు ముట్టాయి. ఆపైన రెండున్నర లక్షలూ సప్లయర్స్‌, ఇతరుల జేబుల్లోకి చేరాయని చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుత్తి, గుంతకల్‌, పామిడి, వజ్రకరూర్‌, ఉరవకొండ, విడపనకల్లు, కళ్యాణదుర్గం, కదిరి తదితర మండలాల్లో అక్రమాలు అధికంగా జరిగాయని ఆరోపణలొస్తున్నాయి. కదిరి మండలంలో ఒక కిందిస్థాయి అధికారి ఏకంగా 12 లారీల విత్తనాలు దారిమళ్లించినట్లు వ్యవసాయశాఖలోని వారే ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది. ఇటువంటి ఉదంతాలు చాలానే సంభవించాయని చెబుతున్నారు.