రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) :పార్వతీపురం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎసిబి డిఎస్‌పి రామచంద్రరావు కథనం ప్రకారం... సాలూరులోని గొర్లి వీధిలో రవ్వా బద్రినాథ్ అనే వ్యాపారి షాపింగ్ కాంప్లెక్స్ కం ఇంటిని నిర్మించుకున్నారు. ఇందుకుగానూ బివి రమణకుమార్ అలియాస్ రమణాజీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కాంప్లెక్స్ నిర్మాణం మున్సిపల్ నిబంధనలకు కొంతవిరుద్ధంగా జరిగింది. దీంతో, ఇంటి యజమానికి మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శంకరరావును బద్రినాథ్ కలిశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.4 లక్షలు లంచం ఇవ్వాలని ఆయనను కమిషనర్ డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని, రూ.2 లక్షలు ఇస్తానని, ఇదీ కూడా ఒకేసారి ఇవ్వలేనని, రెండు విడతల్లో ఇస్తానని బద్రినాథ్ చెప్పారు. దీనికి మున్సిపల్ కమిషనర్ అంగీకరించడంతో తొలుత రూ.50 వేలను ఇటీవల ఇచ్చారు. మిగతా డబ్బులు మంగళవారం ఇస్తానని చెప్పి ఎసిబి అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌కు ఆయన ఛాంబర్‌లో రూ.1.50 లక్షలను బద్రీనాథ్ ఇచ్చారు. అదే సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని మున్సిపల్ కమిషనర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కమిషనర్ గతంలో అరెస్టయ్యారు. ఆ కేసు నుంచి బయటపడి నెల్లూరు కార్పొరేషన్‌లో విధుల్లో చేరారు. ఆ తర్వాత సాలూరు కమిషనర్‌గా ఈ ఏడాది జనవరిలో బదిలీపై వచ్చారు.










