Sep 01,2023 07:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర డిజిపి కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిపై డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. డిజిపి కార్యాలయంలో అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ముపిరాల బాలసుబ్రమణ్యం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. బాలసుబ్రమణ్యం తన వద్దకు వచ్చిన ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు అవినీతికి పాల్పడుతున్నట్లు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అవినీతిపై విచారణ చేయాలని అవినీతి నిరోధకశాఖ అధికారులను డిజిపి ఆదేశించారు. డిజిపి కార్యాలయంలో కూడా అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్న ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.