Aug 31,2023 07:13
  •  పెరుగుతున్న జ్వర పీడితులు
  •  కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : వర్షాకాలం వచ్చిందంటే చాలు గుమ్మలక్ష్మీపురం మన్యం వ్యాధులతో మంచాన పడుతుంది. ఏ గ్రామం చూసినా జ్వర పీడితులే మంచం పట్టి కనిపిస్తున్నారు. పారిశుధ్య లోపం, ఈగలు, దోమల వ్యాప్తి, కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు మలేరియా, వైరల్‌ జ్వరాల బారినపడుతున్నారు. వైద్యం కోసం వస్తున్న రోగులతో ఆసుపత్రులు కిట కిట లాడుతున్నాయి.రోజు వారి ఒపి 150 పైనే అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం భద్రగిరి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైద్యం కోసం ఎక్కువగా వస్తున్న వారిలో విద్యార్థులు, మహిళలు, వృద్ధులే ఉన్నారు. ఎక్కువ శాతం మంది జ్వరాలు, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి వ్యాధుల లక్షణాలతో వైద్యం కోసం వస్తున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. రోజువారి ఒపి 150పైగా నమోదు అవుతుంది. రోగుల సంఖ్య ఎక్కువగా ఉండి మంచాలు సరిపోకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా రోగులకు అన్ని రకాలైన వసతులు కల్పించడంలో మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. దీంతో వైద్యం కోసం వెళ్తున్న విద్యార్థులకు సాధారణ పరీక్షలతోనే సరిపెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆశ్రమ పాఠశాలలు, వసతి గహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు స్థానికంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆదివాసీ ఆరోగ్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యా సంస్థలు మొదలుకొని కెజిహెచ్‌ వరకు హెల్త్‌ వాలంటీర్లను నియమించింది. ఆశ్రమ పాఠశాలలు, ఆసుపత్రుల్లో సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించింది. దీంతో పాటు ఐటిడిఎలో ఒక వైద్యాధికారి, మోనాటరింగ్‌ అధికారి ఉండేవారు. సీరియస్‌ కేసులను ఇక్కడ నుంచి విశాఖ కెజిహెచ్‌కు తరలించే బాధ్యత వహించేవారు. దీంతో విద్యార్థులకు సకాలంలో వైద్య సేవలందడంతో మరణాలు అదుపునకు వీలుండేది. ప్రభుత్వం మారాక హెల్త్‌ వాలంటీర్లను తొలగించడంతో పోయాయి. దీంతో విద్యార్థులకు స్థానికంగా వైద్యం అందక సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం పొందుతున్నారు.