Jul 25,2023 17:03

ప్రజాశక్తి-పార్వతీపురం : ప్రతి నియోజక వర్గంలో అధిక ప్రాధాన్యత క్రమంలో ఉన్న సమస్యల పరిష్కారంపైనే అధికారులు శ్రద్ధ వహించాలని జిల్లా ఇన్‌ ఛార్జ్‌ మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సాలూరు నియోజకవర్గ అభివద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన్యం జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ పెద్దగెడ్డ రిజర్వాయరు పునరావాస పనులు, చెరుకుపల్లి గెడ్డ పనులు, అక్వాడేక్ట్‌ పనులు ప్రాధాన్యతలో చేపట్టాలని ఆయన అన్నారు. సురాపాడు పై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రహారీ గోడలు, గేట్లు, సి.సి కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉండాలని, ఈ మేరకు జి.ఓ 40 జారీ చేశామని ఆయన అన్నారు. వీటిపై దష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ శాఖల వారీగా వచ్చే ప్రతిపాదనలు, వాటిపై చర్యలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. ప్రాధాన్యతా భవనాలు పూర్తి చేయాలని ఆయన సూచించారు. విద్యుత్‌ కార్యనిర్వహణ ఇంజినీర్‌ గుమ్మడం గహ కాలనీ పరిశీలించి విద్యుత్‌ కల్పించుట చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పునరావాస పనులు రూ.7.92 కోట్లకు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, చెరుకుపల్లి గెడ్డ పనులు రూ.4.67 కోట్లతో ప్రతిపాదించగా ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని, వి.ఆర్‌.ఎస్‌ పై అక్వడేక్ట్‌ పనులు రూ.5.70 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చామని జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారి ఆర్‌.అప్పారావు తెలిపారు. అడారుగెడ్డకు దుగ్గేరు వద్ద ఆనకట్ట కట్టుటకు రూ.4.50 కోట్లతోను, దలైవలస వద్ద పెడ్డగెడ్డ పై డైవర్షన్‌ స్ట్రక్చర్‌ నిర్మాణానికి రూ.3 కోట్లతో నిర్మించుటకు ప్రతిపాదించామని అన్నారు. 22 బ్లాకుల్లో 1248 టిడ్కో గహాలు నిర్మాణం జరుగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి అవుతాయని డి.ఇ తెలిపారు. మౌళిక సదుపాయాలు కల్పనకు రూ.7.76 కోట్లతో పనులు మంజూరు అయ్యాయని ఆమె తెలిపారు. సాలూరు మునిసిపాలిటిలో రూ.4 కోట్లతో పార్కు నిర్మాణానికి ప్రతిపాదించామని మునిసిపల్‌ కమీషనర్‌ శంకర రావు తెలిపారు. సాలూరు అత్యధిక లారీలు ఉన్న ప్రాంతమని, ఆటో నగర్‌ అవసరమని, రూ.10 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవింద రావు, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్‌, సాలూరు నియోజకవర్గ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.