ప్రజాశక్తి -సాలూరు(మన్యం): జి గ్రామ్ జూట్ మిల్లు తెరవాలని.. కార్మిక జేఏసీ చేపట్టిన దీక్ష 12 వ రోజుకు చేరుకుంది. శనివారం దీక్షా శిబిరానికి చేరుకున్న రిటైర్ ఉద్యోగుల సంఘం నాయకులు, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకలు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు ధనుంజయ రావు ,డిజి ప్రసాదు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు మిల్లును తెరవకపోవడం వలన వందలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రభుత్వ చర్యలు ఉపాధిని పెంచేవిగా ఉండాలని ,యాజమాన్యం నిరవధికంగా ఫ్యాక్టరీని మూసివేసిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం యాజమాన్యానికి మద్దతిస్తున్నారా?.. బలపరుస్తున్నారా?.. అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఏకైక పరిశ్రమను కాపాడుకోలేని స్థితిలో ఈరోజు యాజమాన్యాలు, ప్రభుత్వం ఉందని విమర్శించారు. మిల్లును తెరిపించుకోవడం కోసం కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి ఉద్యోగులంతా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ సింహాచలం, కే శ్రీనివాసరావు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.










