రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి- యంత్రాంగం:గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆందోళనకు దిగారు. పర్మినెంట్ చేయాలని, 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ విధానాన్ని అమలు చేయాలని, క్లాప్ ఆటో డ్రైవర్లకు జిఒ 7 ప్రకారం రూ.18,500 గౌరవ వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లలో కార్పొరేషన్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, నగర పంచాయతీల వద్ద ధర్నా చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సిఐటియు ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో వక్తలు మాట్లాడుతూ 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అనేకమార్లు ఫోన్లు చేసి పర్మినెంట్ విషయమై అడిగితే. అది రాజకీయ వాగ్దానమని, తమకు సంబంధం లేదని కాల్ సెంటర్ నుండి చెబుతున్నారన్నారు. జగనన్నే మా నమ్మకం అని ఇంటింటికీ స్టిక్కర్లు అతికిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికులు జగనన్నను నమ్మారని అన్నారు. నమ్మినందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గాజువాక, మధురవాడల్లోని జివిఎంసి జోనల్ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 వేతనం ఇవ్వాలని, రిస్క్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలను ఈ నెల 18లోగా పరిష్కరించకుంటే 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ మేరకు జోనల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. నెల్లూరులో ర్యాలీ, కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, కడప నగర పాలక సంస్థ ధర్నా చేశారు. కావలి, పార్వతీపురం, సాలూరు, పాలకొండ, రాజాం పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, బద్వేలు, రాజంపేట, గూడూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నంద్యాల, డోన్, ఆత్మకూరు, రాయదుర్గం, గుంతకల్లు, కదిరి, ధర్మవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, కొండపల్లి తదితర మున్సిపాల్టీల్లో ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు.










