- హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎవి శేషసాయి
ప్రజాశక్తి -నెల్లూరు:న్యాయవాద వృత్తిలో రాణించాలంటే బాగా వాదించడంతోపాటు సందర్భానుసారంగా మౌనంగా ఉండడం కూడా ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎవి శేషసాయి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణంలో నూతనంగా నిర్మించిన న్యాయస్థాన భవనాలను జిల్లా న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్‌తో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శేష సాయి మాట్లాడుతూ తక్కువ వ్యవధిలోనే భవన నిర్మాణాలను పూర్తి చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటానికి కఅషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. భవన నిర్మాణాల కోసం జిల్లా పరిపాలన న్యాయమూర్తి రమేష్ ప్రత్యేక శ్రద్ధపెట్టారని ప్రశంశించారు. న్యాయమూర్తుల మంచి తీర్పులు వస్తున్నాయంటే ఆయా న్యాయవాదులు మంచిగా వాదిస్తున్నారని అర్థమవుతుందన్నారు. బార్ అసోసియేషన్ బాగుంటేనే బెంచ్ కూడా బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి యామిని, జిల్లా ఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.










